కరోనా మహమ్మారి కట్టడి చేయటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పే ప్రతి విషయం ప్రజల్లోకి వెళుతోంది. మోదీ ఏమి చెబుతారా అని యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ సమస్తిపుర్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఆయన స్నేహితులు.. వినూత్న ఆలోచన చేశారు. ప్రధాని మోదీ వేషధారణలో ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నారు.
కార్పూరి కళాశాలలో విధులు నిర్వర్తిస్తోన్న భూపేంద్ర యాదవ్ చూడటానికి అచ్చం మోదీలా ఉంటారు. ఇంకేముంది.. వారి ఆలోచన కార్యరూపం దాల్చడం మరింత సులువైంది. భూపేంద్ర యాదవ్.. మోదీలా తయారై, మథురాపుర్ ఘాట్ నుంచి నగరం మొత్తం ఏనుగుపై తిరిగారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించొద్దని, ఇళ్లలోనే ఉండాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఏనుగుపై వస్తోన్న మోదీలా ఉన్న వ్యక్తిని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రధాని చెప్పిన మాట ప్రజల్లోకి చేరుతుందనే నమ్మకంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు ప్రచార నిర్వాహకుడు మహేంద్ర ప్రధాన్ తెలిపారు.
"ఇలాంటి ప్రచారాలు తరచుగా నిర్వహిస్తూ కరోనా వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయాలి. నగరంలోని హాత్ బజార్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించేలా ఈ మాటలు వారిని ప్రోత్సహిస్తాయి. లాక్డౌన్, భౌతికదూరం ఒక్కటే కరోనాను కట్టడి చేయగల ఆయుధాలని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు."
-మహేంద్ర ప్రధాన్, నిర్వాహకుడు
ఈ వినూత్న కార్యక్రమానికి పోలీసుల విభాగం కూడా సహకరించి, కావాల్సిన ఏర్పాట్లు చేసింది.