ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. తాజాగా విడుదల చేసిన వ్యాఖ్యాతల జాబితా ప్రకారం ఈ నెల 27న ఉదయం మోదీ ప్రసంగిస్తారు. వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం. మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడనున్నారు.
ఐరాస సమావేశాల కోసం మోదీ సెప్టెంబర్ 23న న్యూయార్క్ చేరుకోనున్నారు. దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. మోదీ 2014లో తొలిసారి ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించారు.
112 మంది దేశాధినేతలు..
ఐరాస వార్షిక సదస్సులో ప్రసంగించేవారి తాజా జాబితా ప్రకారం 112 మంది దేశాధినేతలు, 48 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 30 మంది విదేశాంగ మంత్రులు హాజరవుతున్నారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 24-30 మధ్య జరగనున్నాయి. ఈ సదస్సులో సంప్రదాయం ప్రకారం మొదట బ్రెజిల్ అధినేత ప్రసంగిస్తారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు మాట్లాడతారు. ఈనెల 24న ఉదయం డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని వినిపిస్తారు.
ఒప్పందాలు..
ఈ పర్యటనలో భాగంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రధాన అజెండాతో ఉన్నారు మోదీ. పలువురు ప్రపంచ స్థాయి నాయకులతో సమావేశం కానున్నారు.
గేట్స్ పురస్కారం..
ఐరాస సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో 'బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్' ప్రకటించిన ప్రతిష్ఠాత్మక 'గ్లోబర్ గోల్‌కీపర్ అవార్డ్-2019'ను మోదీ స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 24న జరగనున్న 4వ వార్షిక గోల్‌కీపర్స్ సమావేశంలో మోదీకి ఈ అవార్డ్ అందజేయనున్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినందుకు గానూ ఈ అవార్డు ప్రకటించింది సంస్థ.
గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని...
సెప్టెంబర్ 24న ఐరాస ప్రధాన కార్యాలయంలో గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని 'నాయకత్వ విషయాలు: సమకాలీన ప్రపంచంలో గాంధీ ఔచిత్యం' అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. అలానే ఈ నెల 25న బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ లో ప్రసంగిస్తారు.
ఇదీ చూడండి: పాక్ సైన్యం-ఉగ్రవాదుల చొరబాటు కుట్ర భగ్నం