పేదరిక నిర్మూలన కోసం ఉగ్రవాదంపై పోరాటం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ముష్కరులను ఏరిపారేస్తే... రక్షణ కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలను ఆదా చేసి, పేదల సంక్షేమానికి వెచ్చించవచ్చని వివరించారు.
బిహార్ దర్బంగాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ప్రధాని. విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
" కొంతమందికి భారత్మాత్కీ జై, వందేమాతరం అనేందుకు సమస్య ఉంది. అలాంటి వారిని ఓడించాలా వద్దా? వారే భారత్ గురించి నేను మాట్లాడినప్పుడు ఫిర్యాదు చేశారు. మోదీ తీవ్రవాదుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వారికి తీవ్రవాదులతో సమస్య లేదు. ఇది నవ భారత్. తీవ్రవాదుల స్థావరంలోకి వెళ్లి మట్టుబెట్టి వచ్చాం. గొంతు చించుకుని వైమానిక దాడుల ఆధారాలు అడిగిన వారి ఆచూకీ మూడు దశల ఎన్నికల అనంతరం గల్లంతైంది. గతంలో పాకిస్థాన్‌కు వంత పాడిన వారు ఇప్పుడు మోదీ, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. 20 సీట్లలో పోటీ చేసేవారు ప్రధానమంత్రి రేసులో నిలబడుతున్నారు. కర్ణాటకలో 8 సీట్ల బరిలో ఉన్నా ప్రధాని కావాలనుకుంటున్నారు. 40 సీట్లలో పోటీ చేసినా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'మోదీపై పోటీ చేసేది ప్రియాంక కాదు... అజయ్'