గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చర్చలు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో.. రైతులు, యువత జీవితాలపై సాంకేతికత ప్రభావం, డేటా భద్రతకున్న ప్రాముఖ్యం వంటి అంశాలను చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"ఈ రోజు ఉదయం.. సుందర్ పిచాయ్తో ఎంతో ఫలప్రదమైన చర్చలు జరిపాను. వివిధ అంశాలపై మాట్లాడుకున్నాం. ముఖ్యంగా.. భారత రైతులు, యువత, పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చే విధంగా సాంకేతికత శక్తిని సద్వినియోగం చేసుకోవడంపై చర్చించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
కరోనా సంక్షోభంతో పని తీరులో వస్తున్న మార్పులపైనా ఇరువురు చర్చించినట్టు వెల్లడించారు మోదీ. సంక్షోభంతో క్రీడలు సహా ఇతర రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ప్రస్తావించినట్టు పేర్కొన్నారు.
వివిధ రంగాల అభివృద్ధికి గూగుల్ చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. విద్య, డిజిటల్ ఇండియా, డిజిటల్ లావాదేవీల గురించి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చూడండి:- డిజిటల్ ఇండియా కోసం గూగుల్ రూ.75వేల కోట్ల నిధి