దేశ రాజధాని దిల్లీలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో తలపాగా ధరించి పాల్గొనే సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించారు మోదీ.
ఏటా ప్రత్యేకంగా రూపొందించిన తలపాగాల మాదిరిగానే ఈ ఏడాది ఎరుపు రంగు తోకతో పసుపు-నారింజ వర్ణం గల బంధేజ్ తలపాగా ధరించారు ప్రధాని.
అమర జవాన్లకు నివాళి..
ఏటా గణతంత్ర దినోత్సవాన దిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు ప్రధాని. కానీ.. ఈ ఏడాది నూతనంగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. సంప్రదాయ దుస్తులు కుర్తా పైజామా, జాకెట్‌తో పాటు తలపాగా ధరించి హాజరయ్యారు మోదీ.
బంధేజ్.. ప్రత్యేకం
ప్రధాని మోదీ ధరించిన బంధేజ్ తలపాగా.. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిన టై అండ్ డై పద్ధతిలో తయారు చేస్తారు.
తొలిసారి నుంచే..
2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు తలపాగా ధరించి హాజరవుతున్నారు మోదీ. తొలిసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన సమయంలో ఆకుపచ్చ రంగు తోకతో ఎర్రని తలపాగా ధరించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక్కో వేడుకలో ఒక్కోలా వివిధ రంగుల్లో.. ప్రత్యేకంగా తయారు చేసిన తలపాగాలను ధరిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు