సౌదీ అరేబియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 28-29 తేదీలలో చేసిన పర్యటన.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలతో పాటు ఇంధనం, పెట్టుబడి రంగాల్లో సత్ఫలితాలను రాబట్టిందని చెప్పుకోవచ్చు. అంతేకాక భవిష్యత్తులోనూ ఇరుదేశాలు బలమైన స్నేహ బంధం కొనసాగించడానికి ఈ భేటీ దారులు చూపింది. అలాగే సౌదీలో ఉంటున్న 26 లక్షల మంది ప్రవాస భారతీయుల మద్దతు సౌదీ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల మనుగడకు ఉపయోగపడేలా బాటలు పరిచింది. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న భారత జాతి ప్రయోజనాలతో పాటు గల్ఫ్ దేశాలతో భారత్ ఏర్పరచుకుంటున్న అత్యున్నత నూతన సంబంధాలకు తాజా పర్యటన అద్దం పట్టింది.
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి
అత్యంత ప్రాముఖ్యత కలిగిన తాజా పర్యటన ఫలితాలలో ముందుగా చెప్పుకోవాల్సింది భారత ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ల అధ్యక్షతన జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు గురించే. 2010 మార్చిలో ప్రకటించిన రియాద్ డిక్లరేషన్ ప్రకారం భారత్-సౌదీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలతో పాటు సమాచార మార్పిడికి ఓ అత్యున్నత వేదికలా ఈ మండలి వ్యవహరిస్తుంది. రెండు దేశాల నిర్ణయాలను పంచుకోవడం సహా వాటిని అమలు చేసుకోవడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది.
ప్రధాన అంశాల కోసం రెండు విభాగాలు
వివిధ అంశాలను చర్చించడానికి మండలిలో ప్రధానంగా రెండు విభాగాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓ విభాగంలో రాజకీయం, భద్రత, సాంస్కృతిక, సామాజిక, రక్షణ అంశాలపై వ్యూహాత్మక మండలి ప్రధానంగా చర్చిస్తుంది. మరో విభాగంలో ఆర్థిక రంగం, పెట్టుబడులు వంటి అంశాలలో ఇరుదేశాల భాగస్వామ్యం మెరుగుపడేలా మండలి తోడ్పాటునందిస్తుంది. ఈ రెండు విభాగాలకు ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు, వాణిజ్య మంత్రులు నేతృత్వం వహిస్తారు. సౌదీ తన విజన్ 2030లో భాగంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ముందడుగు వేసింది.
వ్యక్తిగత స్నేహం వల్లే
ప్రధాని సౌదీ పర్యటనకు క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడానికి భారత జాతీయ సలహాదారు అజిత్ డోభాల్ అక్టోబర్‌లో సౌదీ పర్యటన చేపట్టారు. అయితే భారత్-సౌదీల వ్యూహాత్మక బంధాన్ని మరింత బలపరచడంలో మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ల వ్యక్తిగత స్నేహబంధం కూడా ఉపకరించిందనేది వాస్తవం.
రక్షణ-తీవ్రవాదం
రెండు ప్రధాన అంశాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రాధాన్యతా క్రమంలో వ్యూహాత్మకంగా మెరుగుపరచుకోవడానికి దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. ఒకటి నావికా దళ భద్రత సహా.. ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లను ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు.
హిందూ మహా సముద్రం ప్రాంతం సహా గల్ఫ్ ప్రాంత రవాణా మార్గాలలో రక్షణ కోసం ఇరుదేశాల మధ్య పెంపొందించుకున్న పరస్పర సహకారం గురించి చర్చల తర్వాత విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో పాటు వచ్చే ఏడాది జనవరిలో రెండు దేశాలు కలిసి ఉమ్మడిగా నావిక దళ విన్యాసాలు చేయడానికి నిర్ణయించాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో అత్యధిక శాతం హర్మూజ్ జలసంధి, ఎర్ర సముద్రం ద్వారానే రవాణా అవుతోంది. ఈ ప్రాంతం భారత్‌కు రక్షణ పరంగా చాలా ముఖ్యమైన మార్గం.
ఇప్పుడు రెండు దేశాల విన్యాసాల వల్ల పశ్చిమ ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ తన నావికా దళ సహకారాన్ని మరింతగా పెంచుకున్నట్లవుతుంది. తీవ్రవాద వ్యతిరేక అంశాలలో భాగంగా ఇరుదేశాలు సమాచార మార్పిడి, సామర్థ్యాలను పెంపొందించుకోవడం సహా అంతర్జాతీయ నేరాలను సమర్థంగా ఎదుర్కొవడం కోసం ద్వైపాక్షిక సహకారాన్ని అందించుకోనున్నాయి. సౌదీ నిధులు సమకూర్చే యునైటెడ్ నేషన్స్ ఉగ్రవాద వ్యతిరేక సెంటర్ ద్వారా బహుముఖ సంబంధాలను నెలకొల్పేందుకు ఇరుదేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు.
విశ్వవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2011లో 'యూఎన్సీటీసీ'ని ఏర్పాటు చేసింది. ఇందులో 22 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 2012 ఏప్రిల్ 2న ప్రారంభమైనప్పటి నుంచే భారత్ యూఎన్సీటీసీలో సభ్య దేశంగా ఉంది.
అరబ్ దేశాలపై భారత్ వైఖరి
అరబ్‌లోని వివిధ దేశాలలో ఉన్న రాజకీయ సమస్యలపై భారత వైఖరేమిటో ఇరుదేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో స్పష్టమైంది. సౌదీ మద్దతుతో గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ ద్వారా యెమెన్ సంక్షోభానికి పరిష్కారం చూపడంతో పాటు 1967 ప్రకారం పాలస్తీనాను జెరూసలెం రాజధానితో కూడిన ప్రత్యేక రాజ్యంగా పరిగణించే విషయం సహా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మాణం-2254 ప్రకారం కాల్పుల విరమణ, సిరియా సంక్షోభానికి రాజకీయ పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది.
తమ దేశ సమగ్రత, సార్వభౌమత్వాలను కాపాడుతూ ఇతర దేశాల అంతర్గత వియాల్లో తలదూర్చకూడదని ఉమ్మడి ప్రకటనలో ఇరుదేశాలు చాటాయి. పాకిస్థాన్‌ను ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా కశ్మీర్ విషయంలో భారత్‌పై అనవసరంగా నోరుపారేసుకుంటున్న దాయాది దేశానికి ఇది చెంపపెట్టులాంటిదే.
జీ20-ఓ వేదిక
2020 నవంబర్‌లో సౌదీ ఆతిథ్యమిస్తున్న జీ20 దేశాల సదస్సులో భారత్ పాల్గొనే విషయాన్ని ప్రధాని ఇప్పటికే ఖరారు చేశారు. 2022 లో జరిగే జీ20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఐక్యరాజ్యసమితి కేవలం సంస్థలా కార్యచరణ సాగిస్తే సరిపోదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. సానుకూల మార్పులు తీసుకురావడానికి ఓ సాధనంలా పనిచేయాలని సూచించారు. దీంతో 2020 సెప్టెంబర్ 21న జరిగే ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవంలో బహుళ పాక్షిక సంబంధాలలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్న ఇరు దేశాల నాడి వినిపించడానికి జీ20 దేశాల సదస్సు ఓ వేదికలా ఉపయోగపడుతుంది.
రచయిత - అశోక్ ముఖర్జీ, భారత తరపున ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి
ఇదీ చూడండి: నూతన భారతావని: జమ్మూ-కశ్మీర్ యూటీలో పీఓకే