బిమ్స్టెక్ దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లొటాయ్ షెరింగ్తో దిల్లీలో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమిద్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగనాథ్తోనూ భేటీ అయ్యారు మోదీ.
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాలతో పాటు మారిషస్, కిరిగిస్థాన్ నేతలు హాజరయ్యారు.
శాంతిభద్రతలే అజెండా
శ్రీలంకలో ఈస్టర్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం కట్టడిపై సిరిసేన, మోదీ చర్చించారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో పరిస్థితులపై సమాలోచనలు చేశారు.
"ప్రమాణ స్వీకారానికి వచ్చినందుకు సిరిసేనకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా మెలుగుతామని స్పష్టంచేశారు."
-భారత విదేశాంగ శాఖ
దృఢ సంబంధాలు
ఇరు దేశాల వృద్ధిపై మారిషస్ ప్రధాని ప్రవీంద్తో చర్చించారు మోదీ. నేపాల్ ప్రధాని ఓలితో సమావేశం సందర్భంగా... రెండు దేశాల మధ్య దృఢ సంబంధాలు ఏర్పడాలని అభిలషించారు. భూటాన్, బంగ్లాదేశ్ దేశాధినేతలతోనూ మోదీ సమాలోచనలు జరిపారు.
షాంఘై సహకార సంస్థ అధ్యక్షుడు, కిరిగిస్థాన్ అధ్యక్షుడు జీన్బెకోవ్తో మోదీ భేటీ అయ్యారు.
"కిరిగిస్థాన్తో ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. "
-భారత విదేశాంగ శాఖ
భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, థాయిలాండ్ సభ్యులుగా 1997లో బిమ్స్టెక్ కూటమి ఏర్పాటైంది. 150 కోట్ల జనాభా కలిగిన బిమ్స్టెక్ స్థూల దేశీయ ఉత్పత్తి 3.5 ట్రిలియన్ డాలర్లు.
ఇదీ చూడండి: వైభవంగా కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం