ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన ప్రసంగాల్లో ఒక్కసారి కూడా నిరుద్యోగం అంశాన్ని ఎందుకు ప్రస్తావించరని మండిపడ్డారు. ఇతర దేశాల గురించి అనర్గలంగా మాట్లాడే మోదీ.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి మాత్రం అసలు మాట్లాడరని ధ్వజమెత్తారు.
బిహార్‌లో రెండో దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ చంపారన్ జిల్లాలోని వాల్మీకి నగర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్లపై విమర్శలు గుప్పించారు.
" పంజాబ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని యువత, రైతులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ప్రసంగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఇతర దేశాల గురించి మాట్లాడుతున్నారు గానీ, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం వంటి సమస్యల గురించి నోరుమెదపరు. ఒకప్పుడు ఇదే అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన వారు ఇప్పుడు మాత్రం మౌనం వహిస్తున్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇప్పుడు వాగ్దానం చేయరు. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పారని బిహార్ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసు. మాకు అబద్ధాలు చెప్పడం రాదు. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
విజయదశమి వేడుకల్లో భాగంగా పంజాబ్ రైతులు ప్రధాని దిష్టబొమ్మ దహనం చేయడం తనను బాధించిందని చెప్పారు రాహుల్. వ్యవసాయ చట్టాలపై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలిపేందుకు ఇది నిదర్శనమన్నారు.