కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు ప్రధాని మోదీ. మహమ్మారి విస్తరించకుండా ఉండాలంటే సామాజిక దూరాన్ని పాటించడమే నివారణ మార్గమన్నారు.
దేశంలో వైరస్ క్రమంగా విస్తరిస్తోందన్న ప్రధాని.. ప్రజలు సామాజిక దూరం పాటించే విషయంపై అన్ని రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కరోనాను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి భారతీయుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం అత్యవసరమన్నారు.
"ప్రజలు భయాందోళకు గురికావద్దు. ఇది అందరూ మెుదట గుర్తించాల్సిన అంశం. అన్ని శాఖలు, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడవచ్చు. మన దేశంలో తొలుత నెమ్మదిగా సోకిన వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం సహా.. రాష్ట్రాల్లో అవసరమైన సౌకర్యాలు, స్థానిక వైద్యులకు శిక్షణ వంటి అంశాలపై చర్చించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: విదేశీయుల వీసాల గడువును పొడగించిన కేంద్రం