పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితులు, దేశ రక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం మరోమారు జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించారు.
ఎన్ఎస్సీ సాధారణ సమావేశాల్లో భాగంగానే సమావేశమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రత, తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ పలు సలహాలు, సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే హాజరయ్యారు.
1998లో అటల్ బిహారీ వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతా మండలి ఏర్పాటైంది. బ్రజేశ్ మిశ్రా మొట్టమొదటి భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.