ప్లాస్టిక్ భూతం.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం దక్కడం లేదు. ఇళ్లు, రోడ్లు, ఆలయాలు.. ఇలా ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ దర్శనమిస్తోంది. అయితే తమ పరిసరాలను శుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి కర్ణాటకలోని చమరాజేంద్ర జూ పార్క్ సిబ్బంది సరికొత్త విధానాన్ని అమలు చేసి అద్భుత విజయం సాధించారు.
మైసూరులోని ఈ జంతు ప్రదర్శనశాలకు పర్యటకుల తాకిడి ఎక్కువే. పండుగలు, సెలవు దినాల్లో వీరి సంఖ్య 10వేలు దాటుతుంది. ఒకప్పుడు జూలో ఎక్కడ చూసినా సందర్శకులు తెచ్చిపడేసే ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు దర్శనమిచ్చేవి. అందుకే పర్యటకుల వద్ద ఉన్న ప్రతి ప్లాస్టిక్ వస్తువుకు బార్కోడ్ స్టిక్కర్ అతికించడం మొదలు పెట్టారు సిబ్బంది. ఒక్కో స్టిక్కర్‌కు రూ.10 వసూలు చేస్తున్నారు. జూలో ఆహ్లాదంగా గడిపి వెనుదిరిగే సమయంలో వారి వద్ద ఉన్న ప్లాస్టిక్ వస్తువులను చూపిస్తే... ఆ సొమ్మును తిరిగి అందజేస్తున్నారు.
"మా జూలో 1,500కు పైగా జంతువులు, పక్షులు ఉన్నాయి. ఏటా 20-25లక్షల మంది దీనిని సందర్శిస్తారు. అందువల్ల ప్లాస్టిక్ కవర్లు ఎక్కడపడితే అక్కడ కనిపించేవి. నూతన చర్యల వల్ల ఈ పరిస్థితిని మార్చాం."
- అజిత్ కులకర్ణి, జూ డైరక్టర్.
ఈ పర్యావరణ హిత చర్యతో సందర్శకులు, స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది జూ యంత్రాంగం.