ప్లాస్టిక్ వ్యర్థాలను మంచికోసం ఉపయోగించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోం మజౌలీ జిల్లాలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు.
మజౌలీ డిప్యూటీ కమిషనర్ విక్రం కైరి ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు కిషాలయ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా 100 అంగన్వాడీ కేంద్రాలను ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌తో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
"ఇది అసోంలో మొట్టమొదటి ప్లాస్టిక్ నిర్మాణ కార్యక్రమం. అయితే ఇంతకుముందు మేం మార్గరిటాలో ఇదే విధానాన్ని ఉపయోగించి ఓ షెడ్డు నిర్మించాం. అది ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. ఈ విధానంతో ఇప్పటికే ఫిలిప్పీన్స్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో నిర్మాణాలు చేపట్టారు. భారత్‌లో కర్ణాటక సహా దక్షిణ భారత రాష్ట్రాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మాణాలను చేపడుతున్నాయి. ఇదే ప్రయోగాన్ని అసోంలోనూ చేయాలని భావించాం. ఈ నేపథ్యంలోనే మజౌలీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం. దీనికోసం 20వేల ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నాం."
-విక్రమ్ కైరి, మజౌలీ డిప్యూటీ కమిషనర్
ఈ కార్యక్రమానికి అసోంలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన బ్రహ్మపుత్ర నది దీవి వేదికైంది. సిలకల గావ్ గ్రామపంచాయతీ పరిధి కకోరికోటా పబనాలో రూ. 80వేల ఖర్చుతో మొట్టమొదటి ప్లాస్టిక్ వ్యర్థాల అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 2019 డిసెంబర్ 25న పునాది వేశారు.
ఈ కిషాలయ పథకంలో భాగంగా తొలి విడతలో 45 అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 కేంద్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానికులంతా భాగస్వాములవుతున్నారు.
"ప్లాస్టిక్ వ్యర్థాలను బయటపారేసే దానికి బదులుగా వాటిని సేకరించి మంచికోసం ఉపయోగించాలి. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాదు.. ఏదైనా నిర్మించేందుకు ఉపయోగపడుతుంది."
-స్థానికుడు
ఈ నిర్మాణాలు చేపట్టేందుకు లక్షల బాటిళ్లు అవసరమని అంచనా. ఇందుకోసం బాటిళ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. పశ్చిమ కకోరికోటాలోని ఇందిరా మహిళల సామాజిక సంస్థ బాటిళ్లను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: చెక్కతో చేసిన టూత్ బ్రష్, కాగితపు స్ట్రాలు చూశారా?