హరియాణా పంచకుల జిల్లాలో ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థులు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. సెల్ టవర్లు లేక సిగ్నల్స్ కోసం చెట్టెక్కి పాఠాలు వింటున్నారు .
పంచకుల, మోర్నీ ఓ పర్వత ప్రాంతం. మోర్నీ నుంచి రాయిపుర్ రాణీ ప్రాంతాల మధ్య దాదాపు 15 కిలోమీటర్ల మేరా గ్రామాల్లో సెల్ టవర్ లేదు. దీనికి తోడు, కరోనా కాలంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మొబైల్ సిగ్నల్స్ మచ్చుకైనా అందని ఆ గ్రామాల్లోని విద్యార్థులు క్లాసులు వినేందుకు అవస్థలు పడుతున్నారు.
మోర్నీలోని డప్నా గ్రామంలో విద్యార్థులు మొబైల్ సిగ్నల్ కోసం ఊరంతా వెతికితే ఓ చెట్టుపై కాస్త సిగ్నల్ అందింది. దీంతో పిల్లలంతా ఆ చెట్టుకిందకు చేరుతున్నారు. ఉపాధ్యాయులు వాట్సాప్లో లింక్ పంపగానే. వారిలో ఒకరు చెట్టెక్కి లింక్ డౌన్లోడ్ చేస్తారు. ఆ పాఠాలను మిగతా విద్యార్థులకు పంపుతారు. ఒకవేళ చెట్టెక్కే అబ్బాయి రాకపోతే ఇక ఆ రోజు చెట్టెక్కడం రాని విద్యార్థులకు తంటాలు తప్పవు.
"చెట్టేక్కే అబ్బాయి రాకపోతే.. మేమే చెట్టెక్కాలి. చదువు కోసం... చెట్టెక్కడం రాకపోయినా ప్రాణాలకు తెగించాలి. "
- రియా ఠాకూర్, విద్యార్థిని
'డిజిటల్ ఇండియా'గా దూసుకుపోతున్న మన దేశంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు చెట్టెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు ఆ విద్యార్థులు.
ఇదీ చదవండి: 'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'