అపాయం నుంచి ఇంటి యజమానురాలిని కాపాడి.. విశ్వాసం చాటుకుందో పెంపుడు శునకం. మహిళపై లైంగిక దాడి చేసే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పసిగట్టి పదే పదే బిగ్గరగా అరుస్తూ పట్టించింది. ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని పొవాయ్ ప్రాంతంలో 33 ఏళ్ల మహిళ తన ఏడేళ్ల కూతురితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె ఓ శునకాన్ని పెంచుకుటున్నారు. ఇటీవలే ఆమె భర్త మరణించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే సర్దార్ ఆలం అనే 25 ఏళ్ల వ్యక్తి.. మహిళతో స్నేహానికి ప్రయత్నించగా ఆమె తిరస్కరించారు. ఆమెపై కక్ష పెట్టుకున్న నిందితుడు లైంగిక దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం కిటికీలోంచి ఆమె ఇంట్లోకి షర్ట్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించాడు. పసిగట్టిన పెంపుడు శునకం పదే పదే బిగ్గరగా అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసింది. తన ఇంట్లో సర్దార్ ఆలంను గుర్తించిన ఆమె.. స్థానికులను పిలిచారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందుతుడిని.. పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆలంను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: పిల్లుల సంరక్షణకు ఎన్జీఓ- పలువురికి ఆదర్శం