ప్రభుత్వ, పంచాయతీ భూముల ఆక్రమణలతో సంబంధం ఉన్న వారు.. క్రమబద్ధీకరణను తమ హక్కుగా పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరణ ఉంటుందని తెలిపింది. హరియాణా సోనీపత్‌లోని సర్సద్ గ్రామస్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.
కేసు నేపథ్యం
అనధికార అధీనంలో ఉన్న భూములను విక్రయించేందుకు హరియాణా ప్రభుత్వం 2000 సంవత్సరంలో విధివిధానాలను ఖరారు చేసింది. '1964 పంజాబ్ విలేజ్ కామన్ ల్యాండ్స్' నిబంధనలనూ సవరించింది. దీనిపై 2008లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2008లో 12(4) నిబంధనను జతచేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోని సాగు చేయని భూములను 2000 మార్చి 31కి ముందు ఇళ్లు నిర్మించుకున్న నివాసులకు విక్రయించే అధికారం గ్రామ పంచాయతీలకు లభిస్తుంది.
గ్రామ పంచాయతీకి చెందిన భూములను అక్రమంగా అధీనంలో ఉంచుకున్నవారు 12(4) నిబంధన ప్రకారం తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. తొలుత సోనీపత్ డిప్యూటీ కమిషనర్ వద్ద అప్పీల్ చేసుకున్నారు. అయితే, రికార్డులను పరిశీలించిన తర్వాత వారు 200 గజాలకన్నా ఎక్కువ భూమిని ఆక్రమించుకున్నారని గుర్తించారు అధికారులు. దీంతో 12(4) నిబంధన వర్తించదని అప్పీల్‌ను తిరస్కరించారు.
డిప్యూటీ కమిషనర్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను పంజాబ్ హరియాణా హైకోర్టు సైతం కొట్టేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించగా.. ఇక్కడ సైతం అదే తీర్పు వెలువడింది.
"ప్రభుత్వ/పంచాయతీ భూములను తమ హక్కు ప్రకారం క్రమబద్ధీకరణ కోరలేరని ఆక్రమించుకున్న వ్యక్తులు గుర్తించాలి. అక్రమ అధీనంలో ఉన్న ప్రభుత్వ/పంచాయతీ భూముల క్రమబద్ధీకరణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నిబంధనల ప్రకారమే ఉంటుంది."
-సుప్రీంకోర్టు
ఈ నిబంధనలను పిటిషనర్లు సంతృప్తిపరచకపోతే పంచాయతీ/ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అనర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: చికాగోలో భారతీయుడి వద్ద 3,200 వయాగ్రా మాత్రలు