దేశంలో కరోనా భయం వెంటాడుతుండటం వల్ల ప్రజలంతా వినాయక చవితి వేడుకలను ఈసారి నిరాడంబరంగానే జరుపుకొంటున్నారు. భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గణేశ్ చతుర్థి సందర్భంగా దిల్లీలోని తమ నివాసంలో ఏకదంతుడికి ఘనంగా పూజలు నిర్వహించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషా నాయుడు. జీవితంలో విఘ్నాలను తొలగించి కరోనా రాకాసి నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వినాయక వ్రతకల్పం చదివారు వెంకయ్య.
" వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, ఆ గణాధిపతి ఆశీస్సులతో ఆటంకాలు తొలగిపోయి, ప్రజలంతా తమ తమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారు. అయితే ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో ఈ పండుగను భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకుందాం."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చూడండి: కనిపించని గణేశ్ చతుర్థి శోభ.. ఆలయాల్లోనే పూజలు!