ఆర్టికల్ 370 రద్దయిన ఒక రోజు అనంతరం జమ్ముకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు తమ దినచర్యల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని పెద్దల సభ ఆమోదించింది.
జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు షా. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఎంత సమయం పడితే అప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందన్నారు. ఈ ప్రకటనను అనేక మంది స్థానికులు స్వాగతించినట్టు అధికారులు వెల్లడించారు.
నిత్యం నిఘా నేత్రాల్లో...
ఆర్టికల్ 370 రద్దుకు ముందే వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని కశ్మీర్ లోయలో మోహరించిన కేంద్రం... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడింది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ శ్రీనగర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంగళవారం శ్రీనగర్‌లో సైన్యం ఉన్నతాధికారుల నేతృత్వంలో నిఘా, భద్రతా విభాగాల సమావేశం జరిగింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వివరించారు.
కమాండింగ్ ఇన్ ఛీఫ్ జనరల్, నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీలో సీనియర్ ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ అధికారులు, నిఘా అధికారులు పాల్గొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో 144 సెక్షన్ కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిత్యం నిఘా ఏర్పాటు చేశారు అధికారులు.
ఇదీ చూడండి:- ఆర్టికల్ 370 సమస్యకు పరిష్కారం 370నే