మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వ ఏర్పాటువైపు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేడు భేటీకానున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై అగ్రనేతలు చర్చించనున్నారు.
పవార్-సోనియా మధ్య భేటీ ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే.. ఆదివారం పుణెలో ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశం జరగడం వల్ల అగ్రనేతల భేటీ వాయిదా పడింది.
ఎన్సీపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం.. పవార్-సోనియా గాంధీ మధ్య నేడు భేటీ ఉండనుందని ఆ పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.
"కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై చర్చించాం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ముగింపు పలికి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పవార్ సోనియా గాంధీతో సమావేశమవుతారు. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై చర్చిస్తారు."
--- నవాబ్ మాలిక్, ఎన్సీపీ నేత.
మంగళవారం ఎన్సీపీ-కాంగ్రెస్ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తారని మాలిక్ స్పష్టం చేశారు.
'కూటమి ఏర్పడగలదా?'
వేరు వేరు సిద్ధాంతాలున్న పార్టీలు(సేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కలిసి కూటమి ఏర్పాటు చేయగలవా అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ సొంతం చేసుకుంది. కానీ ముఖ్యమంత్రి పీఠంపై మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తడం.. 'మహా' ప్రతిష్టంభనకు దారితీసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో కొనసాగుతోంది మహారాష్ట్ర.