లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్షం రోజుల తరువాత ఈవీఎంలపై విమర్శలు చేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఓటింగ్ యంత్రాల విషయంపై దిల్లీలో విపక్షాలతో త్వరలోనే భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో సాంకేతిక నిపుణుల సమక్షంలో ఈవీఎంల కచ్చితత్వంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
ఎన్సీపీ 20వ వార్షికోత్సవంలో భాగంగా ముంబయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు పవార్. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలపై పలువురు సాంకేతిక నిపుణులతో చర్చించినట్లు తెలిపారు.
"పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యంత్రాలను తన ముందు పెట్టుకుని అధికారి కూర్చుంటారు. ఈవీఎం బటన్ నొక్కినప్పుడు అది వీవీప్యాట్లో ప్రతిబింబిస్తుంది. అప్పుడు అధికారి ముందు యంత్రంలోకి బదిలీ అవుతుంది. ఆ యంత్రంలోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు సమయంలో అధికారి ముందు యంత్రంలో నమోదైన ఓట్లపై మీకు ఏదైనా సమాచారం ఉంటుందా? అక్కడే సమస్య ఉంది. ఈ దశలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది"
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈవీఎంలపై సందేహాలు ప్రజల మనసులో మెదలకూడదని అన్నారు పవార్. తమ ఓటు ఒకరికి వేస్తే మరొకరికి పడిందని వారు భావించకూడదని వ్యాఖ్యానించారు. "ప్రస్తుతం ప్రజలు నిశబ్దంగా ఉండొచ్చు... కానీ ఏదోఒకరోజు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుంటారు" అని హెచ్చరించారు పవార్.
ఇదీ చూడండి: కథువా కేసులో ముగ్గురికి 25 ఏళ్లు జైలుశిక్ష