కాంగ్రెస్ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీనమవుతుందన్న వార్తలపై స్పష్టతనిచ్చారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. ఈ ఊహాగానాలన్నీ తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, లోక్‌సభ ఫలితాలపై చర్చించేందుకు శనివారం ముంబయిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు పవార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్సీపీకి సొంత గుర్తింపు ఉందని.. దానిని అలాగే నిలుపుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ఎన్సీపీ విలీనం చేయటమనేది మిత్రపక్షాలతో తమ పార్టీ కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్లు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం శరద్ పవార్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలవటమే కాంగ్రెస్-ఎన్సీపీ విలీనంపై ఊహాగానాలకు తెరలేపింది.
ఈవీఎంలపై ఆరోపణలు..
పార్టీ నేతలతో సమావేశమైన పవార్ ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంల సాంకేతికతపై తనకు అనుమానాలున్నాయని తెలిపారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని గుర్తు చేశారు. అప్పుడు ఓటమి చెందిన పార్టీ..జాతీయ ఎన్నికల్లో విజయం సాధించటం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇదీ చూడండి: 'దీదీకి 10 వేల జై శ్రీరామ్ పోస్టుకార్డులు'