ఇటీవల తనపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పలు విమర్శలకు ఘాటుగా స్పందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో గురువారం ఎన్నికల సభలో పవార్ ప్రసంగించారు. తాను రక్షణమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా దాడులు జరగనివ్వలేదని పవార్ గుర్తుచేశారు.
"మేము ఛత్రపతి శివాజీ పుట్టిన నేల నుంచి వచ్చాం. మా అంతట మేము ఎవరి జోలికీ వెళ్లం. మా జోలికి వస్తే మాత్రం వారికి తగిన చోటును చూపిస్తాం. గత ప్రభుత్వాల 70 ఏళ్ల పాలనలో దేశం అభివృద్ధే చెందలేదని మోదీ పదేపదే విమర్శిస్తున్నారు. వాటిలో వాజ్‌పేయీ నేతృత్వంలోని భాజపాను కలిపి చెబుతున్నారా? " - శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
భద్రతా దళాల పరాక్రమాన్ని ప్రధాని ప్రచారానికి వాడుకుంటున్నారని పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ జైలులో ఉన్న విశ్రాంత నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విడుదలపై మోదీ ప్రభుత్వం కనీసం హామీ ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి వెళ్లిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవార్.