జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. కరోనా విజృంభణతో పాటు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకుకెళ్లారు. వరదల కారణంగా విద్యార్థులు పరీక్షల హాజరయ్యే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని మోదీకి తెలిపినట్లు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇదే విషయమై రెండు రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియల్కు లేఖ రాశారు పట్నాయక్. ఒడిశాలో నీట్‌కు సుమారు 50 వేలు, జేఈఈకు 40 వేల మందికిపైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించటంపై జాతీయ స్థాయిలో ఆందోళనలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించింది. అదే రోజున '‘స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్ సేఫ్టీ'’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది.