మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అధికారం చేజిక్కించుకునేందుకు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు చేతులు కలిపి.. మహారాష్ట్ర ప్రజల తీర్పును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ ప్రైవేటు ఛానళ్తో మాట్లాడిన సందర్భంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు షా. ఎన్నికల ముందు ఏర్పడిన భాజపా-శివసేన కూటమికి.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు ఓటు వేశారని అన్నారు. భాజపాను అధికారానికి దూరం చేయటానికి నైతికతను, నీతి నిజాయతీలను మరిచారని ఆరోపించారు షా.
" ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి మద్దతు తీసుకునేందుకు ఇది గుర్రపు వ్యాపారం కాదు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తున్నా. ఎన్నికల ప్రచారాల్లో ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలు సభలో ఉన్న సందర్భాల్లో దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటన చేశాం. అప్పుడు వారు దానిని ఎందుకు వ్యతిరేకించలేదు? ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ప్రజలు ఇప్పటికీ భాజపాతోనే ఉన్నారు. "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
మాతో కలిసినందునే గెలిచారు
తమతో కలిసి పోటీ చేసినందుకే శివసేన ఎమ్మెల్యేలంతా గెలిచారని అన్నారు షా. మోదీ చిత్రాలు లేకుండా ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదని ఉద్ఘాటించారు. ఈ విషయం మహారాష్ట్రతో పాటు యావత్ దేశ ప్రజలకు తెలియనిదా? అని ప్రశ్నించారు.