పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు ఎంపీలందరూ నేరుగా హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించాయి. అయితే.. కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న వేళ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని స్పష్టం చేశాయి.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. సభలో భౌతికదూరం నిబంధన పాటించడం సవాలుతో కూడిన పనే అవుతుంది. ఇప్పటికే అనేక ఆర్డినెన్స్‌లు ఇచ్చిన కేంద్రం.. వాటిని పార్లమెంటులో ఆమోదించుకోవాల్సి ఉంది. పార్లమెంటు ప్రతి రెండు సమావేశాల మధ్య.. ఆరు నెలలకు మించి సమయం ఉండకూడదు. దాంతో సెప్టెంబర్ 22లోగా సభ సమావేశం కావడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు జరగాల్సి ఉండగా.. ప్రత్యేక పరిస్థితుల కారణంగా మార్చి 23న ముగిశాయి. అనంతరం పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. దిగువసభ పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో, ఎగువ సభ లోక్‌సభ ఛాంబర్‌లో సమావేశం కావొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: షేర్‌చాట్ సూపర్ హిట్- గంటకు 5 లక్షల డౌన్లోడ్స్