దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు నిర్ణయాధికారంలో స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే 'మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్లు-2020'కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 2020, సెప్టెంబర్ 23నే లోక్సభ గడప దాటిన ఈ బిల్లును.. బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు పోర్టులు, నౌకాయానం, జలమార్గాల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా.
ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. 84 మంది అనుకూలంగా ఓటు వేయగా.. 44 మంది వ్యతిరేకించారు.
చర్చ సందర్బంగా బిల్లును పలువురు విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. ఈ బిల్లు ద్వారా ఓడరేవులు నాశనమవుతాయని ఆరోపించారు. అనంతరం వారికి సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి మాండవియా. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఓడరేవుల ప్రైవేటీకరణ కాదని, ప్రైవేటు పోర్టులకు దీటుగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పించటమేమని తెలిపారు. ప్రధాన ఓడరేవుల నియంత్రణ, నిర్వహణ, ప్రణాళికలను అందించటమేన్నారు. అందుకు బోర్డులకు పూర్తి అధికారం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రపంచస్థాయి పోర్టులుగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.
భారత్లోని 12 ప్రధాన ఓడరేవులు.. దీన్దయాల్(కండ్లా), ముంబయి, జేఎన్పీటీ, మార్ముగావ్, న్యూ మంగళూరు, కొచ్చి, చెన్నై, కామరాజర్(ఎన్నోర్), వీవో చిదంబరనర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్కతా(హల్దియా). ఆయా పోర్టుల ద్వారా 2019-20లో 705 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది.
ఇదీ చూడండి: ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే