మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తాత్కాలికంగా నిలిపివేసిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను పునరుద్ధరించింది. సోమవారం లాహోర్ రైల్వే స్టేషన్ నుంచి 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు దిల్లీకి బయలుదేరిందని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
ఇరు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను పునర్ ప్రారంభించేదుకు పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని భారత రైల్వే అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు.
భారత వాయుసేన బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన దాడుల అనంతరం ఫిబ్రవరి 28 నుంచి సంఝౌతా సేవలను పాకిస్థాన్ నిలిపివేసింది.
- ఇదీ చూడండి: రైలులో ప్రయాణికులు 12మందే
1971 యుద్ధం అనంతరం భారత్-పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా 1976 నుంచి ఈ రైలు సేవలు ప్రారంభమయ్యయి. ప్రతి సోమ, గురువారాల్లో లాహోర్ నుంచి దిల్లీ వస్తుంది సంఝౌతా ఎక్స్‌ప్రెస్. భారత్ సంఝౌతా సేవలను దిల్లీ నుంచి అటారీ వరకు కల్పిస్తోంది. ప్రతి బుధ, ఆదివారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ దిల్లీ నుంచి అటారీ వెళ్తుంది.
సంఝౌతాలో సాధారణంగా 70 శాతంగా ఉండే ప్రయాణికుల సంఖ్య పుల్వామా ఘటన అనంతరం భారీగా తగ్గింది. భారత్-పాకిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే కారణం.