పాక్ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను రేపు భారత దౌత్యధికారులు కలిసేందుకు అవకాశం ఇవ్వనుంది. ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుననుసరించి జాదవ్‌ను కలిసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ప్రకటన విడుదల చేశారు.
దౌత్య మార్గంలో వెళతాం: భారత్
పాక్ ప్రకటనను భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. పాక్ ప్రకటనపై దౌత్య మార్గం ద్వారా సంప్రదిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
ఐసీజే తీర్పు
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌లో జైలు జీవితం గడుపుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం జులై 17న తీర్పు వెలువరించింది. కుల్‌భూషణ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని పాక్‌కు స్పష్టం చేసింది ఐసీజే. జాదవ్‌కు న్యాయవాదిని కలిసే హక్కు ఉందని తేల్చి చెప్పింది.
ఐసీజే తీర్పు అనంతరం వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని జులై 26న పాక్‌ను భారత్ డిమాండ్ చేసింది.
ఇదీ కేసు
భారత నావికాదళ మాజీ అధికారిని ఇరాన్లో వ్యాపారం నిర్వహిస్తుండగా 2016లో పాక్ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత పాక్‌లోకి ప్రవేశిస్తుండగా బలోచిస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. విచారించిన పాక్ సైనిక న్యాయస్థానం 2017లో జాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: జాదవ్‌తో మాట్లాడేందుకు అనుమతికి భారత్ డిమాండ్