భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాకిస్థాన్ కొత్త కుట్రలకు పాల్పడుతోందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. డ్రోన్ల సాయంతో ముష్కరులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. గతంలోనూ జమ్ముకశ్మీర్‌కు ట్రక్కుల ద్వారా ఆయుధాలను తరలిస్తున్న పాక్ దుశ్చర్యలను చేధించినట్లు గుర్తుచేశారు.
కశ్మీర్‌లోని కుప్వారా, హీరానగర్, కతువా, రాజౌరి ప్రాంతాల్లో.. ఆయుధాలను తీసుకెళ్తున్న పాక్ డ్రోన్లను చేధించినట్లు దిల్బాగ్ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం 200 మందిలోపే ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ల వల్ల ఈ ఏడాది కేవలం 26 మంది ముష్కరులే భారత భూభాగంలోకి చొరబడినట్లు వివరించారు.
దిల్బాగ్ తెలిపిన మరిన్ని కీలక అంశాలు
- భారత్‌లో పని చేస్తున్న ముష్కరులకు భారీగా ఆయుధాల కొరత ఏర్పడింది. వారికి ఆయుధాలను తరలించేందుకు కొత్త మార్గాలను ఎంచుకొంటోంది పాక్.
- దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేలా అవకాశం కల్పించడానికే సరిహద్దుల్లో కాల్పులను ముమ్మరం చేసింది పాకిస్థాన్.
- 2019లో 267 సార్లు సరిహద్దుల్లో దాడులకు పాల్పడిన దాయాది... 2020లో తొలి ఏడు నెలల్లోనే 75 శాతం అధికంగా (487సార్లు) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
- అయితే ఈ ఏడాది 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రత సిబ్బంది. వారిలో 39 మంది కమాండర్ స్థాయి అధికారులు, మరో 30 మంది విదేశీయులు.
- కొన్నేళ్ల క్రితం 300 నుంచి 350 మంది ఉన్న ఉగ్రవాదులను ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా 200 కంటే దిగువకు తగ్గించగలిగాయి భద్రత దళాలు.
- హవాలా, వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్, టిఫిన్ బాక్సుల కొరియర్ ద్వారా డబ్బు పంపే అన్ని మార్గాలకు అడ్డుకట్ట వేశాం.
- ఉగ్రదాడులు 70 శాతం మేర తగ్గాయి. 2019లో తొలి ఏడు నెలల్లో 198 సార్లు ముష్కరులు దాడులకు పాల్పడగా.. 2020 అదే సమయంలో 124 ఉగ్రదాడులు జరిగాయి.
- ఈ ఏడాదిలో 36 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరో 102మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి: రామాలయంపై పాక్ విమర్శలను తిప్పికొట్టిన భారత్