దౌత్యపరంగా భారత్ చేసిన ఒత్తిడికి పాకిస్థాన్ దిగొచ్చింది. పైలట్ విడుదలకు ఎలాంటి బేరాసారాలకు అంగీకరించేది లేదని, బేషరతుగా విడిచిపెట్టాలన్న భారత్ డిమాండ్‌కు పొరుగు దేశం తలొగ్గింది. ఐఏఎఫ్ పైలట్‌ను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో ప్రకటించారు.
"భారత్ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ దేశం అంతర్గత విషయాలపై దృష్టి పెట్టాలి. ఏకపక్ష నిర్ణయాలతో ఫలితం లేనప్పుడు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. భారత్‌లో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌పై చర్చ జరగాలి. భవిష్యత్తు వ్యూహాలపైనా జరగాలి. విధాన లోపాలతో ఏదైనా ఉగ్రచర్యలు జరిగితే పాక్ వైపు వేలు చూపుతున్నారు. దీనిపైనా చర్చ జరగాలి. ఈ విషయంలో వెనక్కు తగ్గుతున్నామని మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇంకో విషయం.. మనం అదుపులోకి తీసుకున్న భారత వాయుసేన పైలట్‌ను శాంతికి సూచకంగా శుక్రవారం విడుదల చేసేందుకు నిర్ణయించాం."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధానమంత్రి
ఈ ప్రకటనపై పాక్ చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే పాక్ కొత్త వైఖరితో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు తొలగిపోతాయా అనేది చూడాలి.
అంతకుముందు
పాకిస్థాన్ సైన్యం చేతుల్లో బందీగా ఉన్న భారత వింగ్ కమాండర్‌ను పొరుగు దేశం బేషరతుగా, సత్వరమే విడుదల చేయాలని భారత్ మధ్యాహ్నం డిమాండ్ చేసింది. ఇందులో ఎలాంటి జాప్యం చేసినా సహించబోమని తేల్చిచెప్పింది.
పుల్వామా దాడిపై దర్యాప్తు విషయంలో పాక్ ప్రధాని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది భారత్. ఉగ్రవాదులపై సత్వరమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.
ఈనెల 26 భారత వాయుసేన బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపైనే దాడి చేసిందని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేశాయి. పాకిస్థానీ జెట్లు మాత్రం బుధవారం భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించాయని ఆగ్రహం వ్యక్తంచేశాయి.
పుల్వామాతో..
కశ్మీర్లో ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
బాలాకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన బాంబు దాడులు చేసింది. మరిన్ని దాడులకు జైషే సిద్ధమైందని, అందుకే ఆత్మరక్షణ చర్యగా దాడులు చేశామని భారత్ ప్రకటించింది. ఈ దాడుల్లో 350 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం.
బాలాకోట్ దాడి మరుసటిరోజే పాక్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడ్డాయి. ఐఏఎఫ్ ప్రతిఘటనతో వెనుదిరిగాయి. ఈ ప్రయత్నాల్లో రెండు దేశాలకు చెందిన విమానాలు నేలకూలాయి. భారత పైలట్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది.