"తత్త్వవేత్తలు దేశాన్ని పరిపాలిస్తే ప్రజలందరికీ సరైన న్యాయం జరుగుతుంది. సమాజ స్థితిగతులు వారికే క్షుణ్ణంగా అర్థమవుతాయి."
-ప్లేటో
"మంచి, చెడు విచక్షణ తెలుసుకుని, తనంతట తానుగా ఆలోచించి తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచే నిర్ణయం తీసుకునేవాళ్లే అసలైన పాలకులు"
-చాణక్యుడు.
ఈ రెండు మాటలు పీవీ నర్సింహారావుకు సరిపోతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో వానప్రస్థం నుంచి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పీవీ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉపఎన్నికల్లో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు.
1991లో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఒకవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివి తేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ కష్టకాలంలో తోడ్పడ్డాయి. ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత మొదటి వ్యక్తి పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా పీవీ తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పునకు నాంది పలికింది.
ఉగ్రవాద నిరోధక చట్టం రూపకల్పన
రాజకీయాల్లో ఉన్న వారు సాధారణంగా తన వారికి, బంధుమిత్రులకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలని భావిస్తారు. అందుకు భిన్నమైన మనస్తత్వం పీవీది. జెనీవాలో ఐరాస సమావేశాల్లో భారత ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయీని పంపించటం అరుదైన విషయం. లాతూరు భూకంప ఘటనలో ప్రధానిగా పీవీ స్వయంగా తీసుకున్న చొరవ వేలాది మంది ప్రాణాలు కాపాడింది. 1993లో జరిగిన ఈ ఘటనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం ద్వారా బాధితుల కుటుంబాలకు సత్వరమే ఉపశమనం కలిగించారు. బాధితుల పునరావాసం కోసం ఆయన రూపొందించిన విధానం ప్రశంసలందుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయన చేపట్టిన చర్యలూ తక్కువేమీ కాదు. ఉగ్రవాద నిరోధక చట్టం-టీఏడీఏ రూపొందించి అమలు చేశారు.
అణుబాంబు తయారైంది పీవీ హయాంలోనే..
పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా విడిపించిన ఘనత కూడా పీవీదే. 1998లో వాజ్‌పేయీ ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారైంది. ఈ విషయాన్ని స్వయంగా వాజ్‌పేయే ప్రకటించారు. పీవీ తన వాక్‌చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపర్చారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు, ప్రజల మద్దతుతో అందరినీ కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు.
వీగిపోయిన ఆరోపణలు
ప్రధానిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలు ఉండేవి. గతాన్ని, భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా.. ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే అజెండాతోనే పీవీ ముందుకు వెళ్ళేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరగాలని ఆయన కోరుకునేవారు. అయితే పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయనను వెంటాడాయి. కానీ ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది.
ఇదీ చూడండి:తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు