భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విరుచుకుపడ్డారు. కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించడం తమ ఘనతే అని భాజపా నేతలు ప్రకటించుకోవడంపై మండిపడ్డారు.
మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని 1999 నుంచి కాంగ్రెస్ పోరాడుతోందని, ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయని చిదంబరం పేర్కొన్నారు. ఇందులో భాజపా, ప్రధాని మోదీ ఘనతేమీ లేదని ఎద్దేవా చేశారు.
"హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేలా ఎవరు చేశారు. మీరు హఫీజ్ సయీద్ పేరును మరిచిపోయారా? లఖ్వీనీ మరిచిపోయారా? ఈ ఇద్దరినీ అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మసూద్ అజార్ విషయానికి వద్దాం. 1999లో మసూద్ ఎక్కడ ఉన్నాడు. అతను భారత కారాగారంలో ఉన్నాడు. అతడిని ఎవరు విడిచిపెట్టారు. నరేంద్రమోదీ పాత జ్ఞాపకాలు చక్కగా మరిచిపోతారు. ప్రత్యేక అతిథిలా మసూద్‌ను విమానంలో తీసుకువెళ్లి కాందహార్‌లో అప్పగించింది ఎవరు? మసూద్‌ను అప్పగించింది. భాజపా ప్రభుత్వం." -చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: కేజ్రివాల్‌పై యువకుడి దాడి..