ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవిషీల్డ్.. ఇతర టీకాల కన్నా ముందంజలో ఉన్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వెల్లడించింది. దీనిని ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఏకకాలంలో.. సజావుగా జరుగుతున్నట్లు డీసీజీఐ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
" దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్యాండిడేట్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన టీకా అంశంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోంది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ క్యాండిడేట్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికర ఫలితాలు ఇచ్చాయి. అయితే.. మూడో దశ పరీక్షలు ప్రారంభించే ముందు మరిన్ని పత్రాలను సమర్పించాలని కోరాం. "
- డీసీజీఐ అధికారి.
భద్రతపరమైన మరిన్ని పత్రాలు సమర్పించాలని గత సెప్టెంబర్‌లో డీసీజీఐ కోరిన నేపథ్యంలో భారత్‌లో కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత పత్రాలు సమర్పించిన క్రమంలో పరీక్షలను పునరుద్ధరించారు. డీసీజీఐలోని నిపుణుల కమిటీ(ఎస్ఈసీ)కి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ప్రోటోకాల్‌తో పాటు తొలి, రెండో దశ పరీక్షల తాత్కాలిక సమాచారాన్ని అందించారు. వివరణాత్మక చర్చల అనంతరం ఫేజ్-3 పరీక్షల రూపకల్పన సంతృప్తికరంగా ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అలాగే.. రెండో దశ ట్రయల్స్ భద్రత, ఇమ్యూనోజెనిసిటీ డేటాను సమర్పించాలని కమిటీ కోరింది.
వివిధ వ్యాక్సిన్ క్యాండిడేట్ల క్లినికల్ ట్రయల్స్‌ను పరిశీలిస్తే.. వచ్చే ఏడాది అర్ధభాగానికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో సరఫరా సవాళ్లతో కూడుకున్న అంశంగా పేర్కొన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో టీకా ప్రాధాన్యత క్లిష్టంగా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: 10 లక్షల ఉద్యోగాల హామీపై ముఖ్యమంత్రి ఎగతాళి!