దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి 2,07,615కి చేరింది. గత నెల 19 నాటికి కేసుల సంఖ్య 1,01,139కాగా ఈ నెల 3 నాటికి ఆ సంఖ్య రెట్టింపై 2,07,615కు చేరింది. మొదటి లక్ష కేసులకు 111 రోజులు పడితే... రెండో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో గరిష్ఠంగా 8,909 కొత్త కేసులు బయటపడ్డాయి. వరుసగా మూడోరోజు 200కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాయి.
కొవిడ్ కల్లోలం నెలకొన్న అనేక దేశాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉండటంతోపాటు రికవరీ(కోలుకుంటున్న వారి) శాతమూ పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నా... ఇప్పుడు ప్రతిఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉంటే మహమ్మారి తీవ్రత నుంచి అంతగా బయటపడతాం.
మహారాష్ట్రలో సంక్రమణ వేగం తగ్గుముఖం
మహారాష్ట్రలో కరోనా సంక్రమణ వేగం తగ్గింది. ఈ రాష్ట్రంలో మే 1 నాటికి జాతీయ సగటు వృద్ధి (6.24%)ని మించి(7.76%) మేర కేసుల వృద్ధిరేటు ఉంది. సరిగ్గా నెల రోజులకి జాతీయ సగటు వృద్ధి(4.74%) కంటే తక్కువ (4.15%) నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 రోజులకు కేసులు రెట్టింపవుతుండగా, మహారాష్ట్రలో అది 17 రోజులకు పెరిగింది. కాగా దిల్లీలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 రోజుల క్రితం 168గా ఉన్న మరణాల సంఖ్య దాదాపు 3రెట్లు పెరిగి 556కి చేరింది. గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు కొవిడ్ రహితంగా మారిన తర్వాతకూడా మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. అండమాన్‌లో 33 మంది కోలుకొని ఇంటికెళ్లిన తర్వాత కొత్త కేసులేవీ రాలేదు. మిజోరాంలో ఒకేరోజు 12 కేసులు బయటపడ్డాయి. చాలా రోజుల తర్వాత దాద్రానగర్‌హవేలీలోనూ కొత్త కేసు వచ్చింది.
పెరిగిన పరీక్షలు...
దేశంలో కరోనా పరీక్షలు బుధవారం నాటికి 41 లక్షలు దాటాయి. ఇంతవరకు చేసిన పరీక్షల్లో 5.05% మందికి వైరస్ సోకింది. అంటే పరీక్షలు చేసిన ప్రతి 19 మందిలో ఒకరికి వైరస్ సోకినట్లు తేలింది. గత నెల రోజుల వ్యవధిలోనే 30లక్షల పరీక్షలు పెరిగాయి. మే 3న పరీక్షలు చేసిన ప్రతి 25 మందిలో ఒకరికి వైరస్ సోకినట్లు తేలగా ఇప్పుడది 19కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో పరీక్షలు నిర్వహించిన వారిలో 15 మందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇంతవరకు ఇదే గరిష్ఠం.
ఇదీ చదవండి: ఏనుగు మృతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్!