సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ వల్ల లెబనాన్ రాజధాని బీరుట్ ఓడ రేవులో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా చెన్నై ఓడరేవు సమీపంలోని కంటైనర్ సరకు రవాణా కేంద్రంలో 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2015లో దక్షిణ కొరియా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవడంతో దానిని సీజ్ చేశారు. మొత్తం 36 కంటైనర్లలో ఒక్కొక్క దానిలో 20టన్నుల చొప్పున నిల్వ ఉన్నట్లు తెలిపారు.
బీరుట్ ఘటన తర్వాత కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అప్రమత్తమయింది. దేశంలోని కస్టమ్స్ గిడ్డంగులు, ఓడ రేవుల్లో పేలుడు స్వభావం కలిగిన రసాయనాల నిల్వ గురించి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖలకు సూచించింది. ఒక వేళ నిల్వ ఉంటే అక్కడి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? ప్రమాదాల నివారణకు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. ఈ మేరకు ఆ శాఖ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే చెన్నై పోర్టులో నిల్వ ఉంచిన రసాయనాలు భద్రంగా ఉన్నాయని, వాటి వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని కస్టమ్స్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అది అక్రమంగా దిగుమతి చేసుకుంది కావడంతో, ఆ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. త్వరలోనే దానిని సురక్షితంగా తరలిస్తామని వెల్లడించారు.