దేశప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను చేరువ చేసేందుకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50వేల 25 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. 2022 నాటికి మొత్తం 1.5లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
మొత్తం 678 జిల్లాల్లో 27,890 ఉప ఆరోగ్య కేంద్రాలు, 18వేల 536 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3వేల 599 పట్టణ ప్రాథమిక కేంద్రాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 28.10 కోట్ల మందికి సేవలందించినట్లు పేర్కొంది. వారిలో 53శాతం మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. 6.43 కోట్ల మందికి రక్తపోటు పరీక్షలు, 5.23 కోట్ల మందికి మధుమేహం , 6.14 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
కేంద్రం, రాష్ట్రాలు, కెేంద్రపాలిత ప్రాంతాల మధ్య సరైన సహకారం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. సంయుక్త ప్రణాళిక, అన్ని స్థాయిలలో పర్యవేక్షణతో ఈ ఆరోగ్య వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలందించిన వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు హర్షవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య వ్యవస్థకు వారు వెన్నెముక అని కొనియాడారు.