కరోనా మహమ్మారిపై పోరాటానికి 'కొవిడ్ యోధులు' ముందుకు రావాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆయన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. 21 వేల మందికిపైగా పౌరులు తాము సిద్ధమని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవలందిస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో 21,752 మంది 'కొవిడ్ యోధుల'కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు సీఎం. ఒక్క పిలుపుతో ముందుకు రావటం తనకు బలం చేకూర్చిందని, ఈ పోరాటంలో ఓ సైనికుడిలా చేరారని ప్రశంసించారు. కరోనాపై పోరాటాన్ని దేవుడు, దేశం కోసం చేసే సేవగా అభివర్ణించారు ఠాక్రే.
వైద్య వృత్తివారే అధికం..
21,752 మందిలో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, పారామెడిక్స్, వార్డ్ బాయ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వంటి వైద్య వృత్తిలోని వారే 12,203 మంది ఉన్నారు. అందులో చాలా మంది రెడ్ జోన్‌లోనూ పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మిగతా వారు ఉపాధ్యాయులు, సెక్యూరిటీ గార్డ్స్, సామాజిక కార్యకర్తలు, ఇతర వైద్యయేతర వృత్తికి చెందిన వారు 9,649 మంది ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రెడ్ జోన్లో పని చేసేందుకు 3, 716 మంది సుముఖంగా ఉన్నట్లు తెలిపింది సీఎంఓ. ముంబయిలో 3,766 దరఖాస్తులు రాగా, అందులో 1785 మంది వైద్య వృత్తి వారు ఉన్నారని పేర్కొంది.