ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.... ఓటరు జాబితా - ఇతరుల విభాగంలోని ఓటర్ల సంఖ్య 38 వేల 325. గత సాధారణ ఎన్నికలకు, ఇప్పటికి పెరిగింది 15వేల 306 ఓట్లు మాత్రమే.
2012 నుంచే ఎన్నికల సంఘం ట్రాన్స్‌జెండర్ వర్గీయుల్ని ఇతరుల విభాగంలో ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం ట్రాన్స్జెండర్ల జనాభా 4.9 లక్షలు. కానీ... ఇంతకంటే ఎక్కువేనని వాదిస్తున్నారు ఈ వర్గం కార్యకర్తలు.
''లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి గుర్తింపు నమోదు ప్రక్రియ చాలా క్లిష్టం. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడమే... ఈ వర్గానికి చెందిన చాలామంది ఓటరు జాబితాలో నమోదు చేయించుకోకపోవడానికి ప్రధాన కారణం. తనిఖీలో భాగంగా ఎన్నో పత్రాలు అడుగుతారు. కానీ, ట్రాన్స్జెండర్లందరి వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉండవు.
ఓటరు గుర్తింపు కార్డులో ఎన్నో ఏళ్ల క్రితం చాలా మంది పురుషుడు లేదా మహిళగా నమోదు చేయించుకున్నారు. ఇప్పుడు 'ఇతరులు' విభాగంలోకి చేర్చే ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.''
- అనింధ్య హజ్రా, ప్రత్యయ్ జెండర్ ట్రస్ట్ ప్రతినిధి
పాస్‌పోర్ట్‌ల దరఖాస్తు విషయంలోనూ ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. లింగ పరివర్తన అంశంలో 2014 నల్సా తీర్పునకు విరుద్ధంగా స్వీయ గుర్తింపు సర్టిఫికెట్లు అడుగుతుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ట్రాన్స్జెండర్లు ఎందరో చిన్న వయసులోనే ఇళ్లు వదిలి వస్తున్నారు. వారందరికీ జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా రుజువులు ఉండవు' అన్నది మహారాష్ట్ర సఖి ఛార్ ఛౌఘీ ప్రతినిధి గౌరీ సావంత్ వాదన.
''అధికారికంగా ఈ పత్రాలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా మంది ఆర్థికంగా సరైన స్థితిలో లేరు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. యజమానులు మాపై వివక్షతో కనీసం చిరునామా ధ్రువపత్రంపై సంతకం చేయడానికి వెనకాడుతారు. ఈ కారణంతోనే ధ్రువీకరణ కోసమైనా, ఓటరు నమోదు ప్రక్రియకైనా మాలో చాలా మంది దూరంగా ఉంటున్నారు.''
- గౌరీ సావంత్, సఖి ఛార్ ఛౌఘీ ప్రతినిధి
2014 సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మరో కార్యకర్త ఆగ్రహం వ్యక్తంచేశారు.
''స్వీయ గుర్తింపు ఆధారంగా ట్రాన్స్‌జెండర్లందరికీ గుర్తింపు కార్డులివ్వాలన్న కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సిబ్బంది మాది వేరే వర్గమని చిన్నచూపు చూస్తారు. సరిగ్గా స్పందించరు.''
- మీరా సంఘమిత్ర, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త
''కనీసం సాధారణ పౌరులుగానైనా గుర్తించట్లేదు. కీలక ఎన్నికల ప్రక్రియలో ఎందుకు భాగం కావాలి? ఎందుకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి? ప్రభుత్వాలు మాకెలాంటి రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు'' అని కోపోద్రిక్తులయ్యారు మరో కార్యకర్త.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గుర్తింపు కార్డులు కల్పించి.. అదే ప్రామాణికంగా ఓటరు జాబితాలో చోటు కల్పించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ ఒక్క దాని కోసం అనేక పత్రాలపై ఆధారపడకుండా సులభతరం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ట్రాన్స్‌జెండర్ కార్యకర్తలు.