పార్లమెంటులో తమ గళాన్ని ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణచివేస్తోందని విపక్షాలు ఆరోపించాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) వంటి కీలక అంశాలను లేవనెత్తకుండా విపక్షాలను కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించాయి. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ దేశరాజధాని దిల్లీలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రజలను హింసాకాండవైపు ప్రేరేపించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ.
"భాజపా మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టేలా, కలహాలు సృష్టించేలా ఉన్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న దిల్లీలో చేసిన ప్రకటనలు అసమ్మతం. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బాధ్యతాయుతమైన వ్యక్తి.. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారు. ప్రజల్ని తుపాకితో కాల్చాలని, పరలోకాలకు పంపాలని అంటున్నారు. ఈ వ్యాఖ్యలకు భాజపా క్షమాణలు చెప్పాలి. "
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత.
కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లపై చర్చ జరపాలని నిబంధన 267 ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. గత రెండు నెలలుగా సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారని స్పష్టం చేశారు.
ఎన్పీఆర్ గతంలోనూ ఉన్నా.. తండ్రి పుట్టిన తేదీ వంటి ప్రశ్నలు అడిగేవారు కాదని, కానీ ప్రస్తుత ఎన్పీఆర్లో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయని ఆజాద్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఇలా చేస్తోందని విమర్శించారు.
ఇదీ చూడండి: మహిళల పట్ల మతపరమైన వివక్షపై సుప్రీం ప్రశ్నాపత్రం