దేశవ్యాప్తంగా మే 1 నుంచి 19 వరకు.. 1,595 శ్రామిక్ రైళ్లను నడిపినట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ. ఉత్తరప్రదేశ్లో 837 రైళ్లకు అనుమతులు ఇవ్వగా.. బీహార్ 428, మధ్యప్రదేశ్ 100కి పైగా రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్.
ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు 21 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపారు అధికారులు.
రాజకీయ దుమారం..
ఈ ప్రత్యేక రైళ్ల ఏర్పాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. తొలుత ప్రతిపక్షాలు వలసదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. అనంతరం భాజపాయేతర ప్రభుత్వ రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లకు అనుమతివ్వలేదని తెలిపింది కేంద్రం. ఈ కమంలోనే ఇటువంటి రైళ్లను నడిపేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని మంగళవారం రైల్వేశాఖ స్పష్టం చేసింది.
"కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఇటువంటి రైళ్లను నడిపేందుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. శ్రామిక్ రైళ్లను నడిపే విషయంలో హోం శాఖను సంప్రదించి రైల్వే శాఖ అనుమతులు ఇస్తుంది".
-- రైల్వేశాఖ
మిగిలిన వలస కూలీలను తమ స్వస్థలాలకు చేర్చేందుకు.. వచ్చే వారంలో మరో 300 రైళ్లు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 300 రైళ్లను నడిపే సామర్థ్యం ఉన్నప్పటికీ.. గమ్యస్థానాల రాష్ట్రాల నుంచి అనుమతులు లభించకపోవడం వల్ల వాటిలో సగం మాత్రమే నడుపుతున్నట్లు స్పష్టం చేశారు.