జన జీవనానికి ప్రాణాధారమైన జలసిరులను పెంపొందించుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దేశానికి జలశక్తి పెంచేందుకు.. నీటి వనరుల సంరక్షణకు ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా ఆచరణలోనూ గట్టి చర్యలు చేపట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటుచేశారు. 'జలశక్తి అభియాన్', 'జల్‌జీవన్' పేరిట ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారు.
మానవ మనగడకు అత్యంత కీలకమైన భూగర్భజలాలను చాలామంది అడ్డూఅదుపూ లేకుండా తోడేస్తున్నారు. ఎంతలా అంటే.. భూగర్భ జలాలను అత్యధికంగా వాడేసుకుంటున్న దేశాల్లో భారత్‌ది ప్రపంచంలోనే తొలిస్థానం కావడం గమనార్హం. భూగర్భంలోని మొత్తం నీటిలో ప్రతి ఏడాది మనమే పావువంతు తోడేస్తున్నాం. సాగు, తాగునీటి అవసరాలకు వీటిపైనే 65% ఆధారపడుతున్న నేపథ్యంలో వీటిని కాపాడుకోవడం అత్యవసరం.. అందరి బాధ్యత. దేశంలోని మొత్తం 6,800 జలవనరుల బ్లాకులకు గాను ఇప్పటికే 1,592 బ్లాకుల్లో నీటి లభ్యత పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
జలం.. జనం..
- ప్రధానిగా మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి ‘మన్‌కీ బాత్’లో నీటి సంరక్షణ ఆవశ్యకతపై రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతులు సేద్యంలో కనీసం 10% నీటిని తక్కువగా వాడుకోవాలని, సాగులోనూ మార్పులు చేసుకోవాలన్నారు.
- జలశక్తి అభియాన్‌ను నిరుటి జూన్‌లో ప్రకటించారు. దేశంలో తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో - తొలివిడతగా 2019 జులై నుంచి సెప్టెంబరు వరకు, రెండో విడతగా అదే ఏడాది అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు అమలు చేశారు. లక్ష్యాలను సాధించిన జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు ఇచ్చి ప్రోత్సహించింది.
- నీటి సంరక్షణపై 2.5 లక్షల మంది సర్పంచులకు లేఖలు రాయగా 2 లక్షల చెక్‌డ్యామ్‌లు, చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగింది.
జల్ జీవన్ మిషన్
అపరిశుభ్ర తాగునీటితో గ్రామీణులు జబ్బుల బారిన పడుతున్నారు. సమస్య పరిష్కారానికి దేశంలోని గ్రామాలన్నింటికీ 2024 వరకు పైపుల ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా ప్రారంభించాలని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు తొలి విడతలో రూ.4,000 కోట్లను విడుదల చేశారు. మన దేశంలో 18.5 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 3.5 కోట్ల కుటుంబాలకే కొళాయిల ద్వారా నీరందుతోంది. మిగిలిన 15 కోట్ల పల్లె కుటుంబాలకు సురక్షితమైన తాగునీటిని రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందివ్వాలనేదే ఈ పథకం లక్ష్యం.