నిర్భయ కేసులో దోషిగా తేలిన అక్షయ్‌కుమార్ సింగ్... తనకు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెలలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాజ్యం వేశాడు.
నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులకు దిల్లీ ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను 2017లో సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ కేసులోని మరో ముగ్గురు దోషులు గతంలో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్లను.. సుప్రీంకోర్టు 2018 జులై 9న కొట్టివేసింది.
నలుగురు దోషులలో ఇప్పటివరకు సమీక్ష పిటిషన్ దాఖలు చేయని అక్షయ్‌కుమార్.. నేడు న్యాయస్థానాన్ని ఆశ్రయిచినట్లు అతని తరఫు న్యాయవాది ఎ.పి. సింగ్ వెల్లడించారు.
తిహార్ జైలుకు నాలుగో దోషి..
ఆరుగురు ముద్దాయిల్లో ఒకడు బాల నేరస్థుడు కాగా మరో వ్యక్తి రామ్‌సింగ్ 2013 మార్చిలో తిహార్ కారాగారంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు ఊచలు లెక్కపెడుతున్నారు. వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకుర్, ముకేష్ సింగ్ తిహార్ జైల్లో ఉన్నారు. ఉరి తీయడానికి వీలుగా నాలుగో వ్యక్తి పవన్ గుప్తాను మండోలి కారాగారం నుంచి తిహార్‌కు తరలించారు. చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, చివరి ప్రయత్నంగా కావాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి ఈ ఏడాది అక్టోబరు 29నే కారాగార వర్గాలు తెలిపాయి. వీరిలో వినయ్ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేశాయి.
2012లో ఘటన..
దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో ఐదుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించగా అక్కడ కన్నుమూసింది.
ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 1000 మంది శాస్త్రవేత్తల పిటిషన్