చిన్నారుల అక్రమ నిర్బంధం, అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బిడాది ఆశ్రమవాసి, స్వయం ప్రకటిత దేవుడు స్వామి నిత్యానంద ఆచూకీ అంతుచిక్కడం లేదు. ఆయన ఆశ్రమ నిర్వాహకులూ కనిపించని నేపథ్యంలో నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే నిత్యానంద ఓ కొత్త హిందూ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈక్వెడార్ సమీపంలోని ఈ ద్వీపదేశానికి 'కైలాస' అనే పేరు కూడా పెట్టారట. అంతేకాదు ప్రత్యేక జెండాతో పాటు మంత్రి వర్గం కూడా ఉందని సమాచారం. ఈ హిందూ దేశానికి 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కైలాస.ఓఆర్జీ' అనే వెబ్సైట్ కూడా ఉంది.
ఆంగ్లం, సంస్కృతం, తమిళం ప్రధాన భాషలు
ఈ దేశానికి 'రిషభ ధ్వజ'గా పిలిచే పరమ శివుడు, నంది చిహ్నాలతో కూడిన ప్రత్యేక జెండా ఉంది. ఆంగ్లం, సంస్కృతం, తమిళం ఈ దేశ ప్రధాన భాషలుగా ఉన్నాయి. కొత్త దేశ ప్రభుత్వంలో హోంశాఖ, రక్షణ, ఖజానా, వాణిజ్య, గృహ నిర్మాణ, మానవ వనరులు, విద్యా శాఖలు ఉన్నాయి.
ఒక్క క్లూ కూడా లేదు..
కొత్త దేశాన్ని సృష్టిచుకున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో నిత్యానంద ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నకు చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన బిడాది ఆశ్రమంలో ఉండటం లేదని.. దేశవ్యాప్తంగా 10-15 ఆశ్రమాలు ఉన్నందున అందులో ఏదో ఒకచోట ఉండొచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు.
2010లో తొలిసారి కేసు..
2010లో తొలిసారి నిత్యానందపై అభియోగాలు నమోదయ్యాయి. ఓ సినీ నటితో బేరానికి వచ్చిన వీడియో.. వైరల్ కావటం వల్ల సుమారు ఎనిమిదేళ్ల పాటు నిద్రాణస్థితికి వెళ్లారు నిత్యానంద. ఏడాది క్రితం సరికొత్త అవతారంలో వెలుగులోకి వచ్చారు.
గత నెలలో అహ్మదాబాద్‌లోని యోగిని సర్వగ్యాపీఠంలో ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయిన కారణంగా నిత్యానందపై ఎఫ్ఐర్ నమోదైంది. తాజాగా ఆయన కనిపించకుండా పోయారు.
ఇదీ చూడండి: సౌర శక్తితో నడిచే స్కూటర్.. గంటకు 49 కిలోమీటర్ల వేగం!