మట్టి పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. అలాంటి మట్టి మహత్యాన్ని చాటారు ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్ వాసులు. దాదాపు 500 మంది ఒకేసారి మట్టి లేపనం పూసుకున్నారు. వినూత్న ప్రదర్శనతో ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
సోమవారం ప్రపంచ నేచరోపతి దినోత్సవం సందర్భంగా.. గోరఖ్‌పుర్‌లోని ఆరోగ్య మందిరంలో మట్టి లేపనం పూసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి ఔత్సాహికులు గోరఖ్‌పుర్‌కు విచ్చేశారు.
"ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వియత్నాంలోనూ మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ, అది కాళ్లకు మాత్రమే పూసుకుంటాం. ఇలా వైద్యం కోసం ఒంటినిండా కాదు. ఇంకా చాలా మంది వచ్చి, మట్టి పూసుకుని వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను."
-జులియా, వియత్నాం వాసి
"మేము మట్టి లేపనం పూసుకుని పొందుతున్న ఈ ఆనందం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎందులోనైనా ఆనందం వెతకాలంటే అందులో మునిగితేనే కనబడుతుందని అంటారు. అలాగే, మట్టిలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఇలా బట్టలు విప్పి మట్టిలో మునగాల్సిందే. "
- కనక్ హరి అగర్వాల్, గోరఖ్‌పుర్ వాసి
రక్త పోటు నివారణకు ఈ మట్టి లేపనం ఎంతో చక్కగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
"మట్టి లేపనం... సహజ, ప్రాకృతిక ఆరోగ్య సూత్రం. గతేడాది దిల్లీలో 320 మంది మట్టి లేపనం పూసుకుని రికార్డు సృష్టించారు. ఇప్పుడు మేము 500 మందికి మట్టి పూసే కార్యక్రమం చేపట్టాం."
- డా. విమల్ కుమార్ మోదీ, ఆరోగ్య మందిరం డైరెక్టర్
ఇదీ చదవండి: హనీమూన్‌లో సాహసం- వధువు కళ్లెదుటే వరుడు దుర్మరణం