విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వినకపోతే వారిని కొట్టి మరీ చదివిస్తారు కొందరు ఉపాధ్యాయులు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతారు మరికొందరు. ఒడిశాకు చెందిన ఓ టీచర్ మాత్రం వీటికి భిన్నమైన రీతిలో బోధిస్తూ 'డాన్సింగ్ టీచర్ ఆఫ్ ఒడిశా' అనే బిరుదు అందుకున్నాడు.
ప్రఫుల్ల పథి... ఒడిశా కోరాపుట్ జిల్లాలోని లంతాపుట్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. నృత్యం చేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించడం ఈయన ప్రత్యేకత. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రఫుల్ల తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
ఆ వీడియోలో ప్రఫుల్లతో పాటు విద్యార్థులూ నృత్యాలు చేశారు, పాటలు పాడారు. ఈ విధంగా పాఠాలు నేర్పుతుంటే.. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని ప్రఫుల్ల హర్షం వ్యక్తం చేశారు.
"విద్యార్థులకు ప్రతి రోజు ఒక ప్రత్యేక డాన్సింగ్ క్లాస్ ఉంటుంది. ఈ విధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. నృత్యాలు, పాటల వల్ల మధ్యాహ్నం భోజనం చేశాక వారికి నిద్ర రాదు."
-ప్రఫుల్ల పథి, ప్రధానోపాధ్యాయుడు, యూపీఎస్, లంతాపుట్
కోరాపుట్ ప్రాంతంలో గిరిజనులే అధికం. బడులు మానేసే వారినీ ఈ తరహా బోధన ఆకర్షిస్తోందని ప్రఫుల్ల తెలిపారు. బోధించే పద్ధతిని మరింత ఆసక్తికరంగా మల్చగలిగితే... విద్యార్థులు చదువుపై దృష్టిపెడతారని అభిప్రాయపడ్డారు.