మామూలు రోజుల్లో పది రూపాయలుండే మాస్కుల ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. రూ.20, రూ.30, రూ.50... అవీ మార్కెట్లో దొరకడం గగనమైపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వస్తువుల్లా మారిన వీటి కొరతను నివారించడానికి ఒడిశా ప్రభుత్వం 'మిషన్ శక్తి ప్రోగ్రాం' కింద ఆ రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలను మాస్కులు తయారు చేసే పనికి పురమాయించింది. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని ఆనందంగా స్వీకరించారు 400 స్వయం సహాయక బృందాల్లోని నారీమణులు. జనం బాధను తమ బాధ్యతగా భావించారు. సొంత పనులు, ఇతర వ్యాపకాలు పక్కనపెట్టి రాత్రింబవళ్లు కష్టపడుతూ యుద్ధ ప్రతిపాదికన మాస్కులు కుడుతున్నారు. ప్రస్తుతం రోజుకి యాభైవేల చొప్పున మాస్కులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే పదిలక్షల మందికిపైగా పంపిణీ చేశారు. మాస్కుల కొరత తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో ఎక్కువ ధర వసూలు చేసే అవకాశమున్నా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నామమాత్రమైన ధరకే అందిస్తున్నారు.
చైతన్యం నింపుతూ..
కేవలం మాస్కుల తయారీతోనే ఆగిపోలేదు ఈ బృందాలు. ఈ కష్టసమయంలో జనాల్లో చైతన్యం నింపుతున్నారు. ఈ గ్రూపుల్లోని కొందరు మహిళలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అక్కడే ఆహారం తయారు చేసి నిరుపేదలు, యాచకులకు స్వయంగా వడ్డిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధికారుల సాయంతో గ్రామాలు, మండల కేంద్రాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకొని అక్కడ ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు నిల్వ చేసి అవసరమైనప్పుడు అన్నార్తులకు అందిస్తున్నారు.
క్లిష్ట సమయంలో అపారమైన సేవలు చేస్తున్న ఈ స్వయం సహాయక బృందాల సేవానిరతిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెగ మెచ్చుకున్నారు.
'నారీశక్తికి ఒడిశాలోని ఆ మహిళలు నిదర్శనం. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి వారు శక్తికి మించి శ్రమిస్తున్నారు. వాళ్లని చూస్తే గర్వంగా ఉంది.' అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ కరోనా: 15 రోజుల్లో 2 ఆస్పత్రుల నిర్మాణం