ఫొని తుపాను ధాటికి రూ. 12 వేల కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి నివేదించింది ఒడిశా ప్రభుత్వం. తుపాను విధ్వంసంతో తీరప్రాంతంలోని 5 లక్షల ఇళ్లు నేలమట్టం అయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా 64 మంది పౌరులు మరణించారని తెలిపింది.
ఒడిశాలో తుపాను పీడిత ప్రాంతాల్లో పరిస్థితి అధ్యయనం చేయడానికి ప్రధాని కార్యాలయం(పీఎంఓ) అదనపు కార్యదర్శి వివేక్ భరద్వాజ నాయకత్వంలో 11 మంది ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ బృందానికి... తుపాను నష్టంపై ప్రాథమిక నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఒడిశావ్యాప్తంగా రూ.5,175 కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందనీ, రూ.6,767 కోట్లు విపత్తు స్పందన, సహాయక చర్యల కోసం అవసరమని నివేదికలో పేర్కొంది. విపత్తు సహాయక నిబంధనలను సడలిస్తూ అధిక సాయం అందేలా చూడాలని కోరింది.
"మేం ప్రాథమిక అంచనాను మాత్రమే అందించాం. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తే ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వే పూర్తయ్యాక తుపాను నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తాం."
- బీపీ సేఠీ, ఒడిశా ప్రభుత్వ ప్రత్యేక అధికారి
ఇదీ చూడండి: 'అసలే బాధలో ఉన్నాం.. మీరూ బాధపెట్టకండి'