ఒడిశా బెర్హంపుర్కు చెందిన ఓ జంట.. తమ పెళ్లితో నలుగురికి ఆదర్శంగా నిలవాలనే ఆలోచించి.. వివాహంలో ఆచరించి చూపించింది.
నగరానికి చెందిన బిప్లబ్ కుమార్-అనిత వివాహం మంగళవారం జరిగింది. ఇందులో కొత్తేమి ఉందనుకుంటున్నారా..? నవదంపతులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు. వివాహ వేదికపై బంధుమిత్రుల సమక్షంలో రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.
అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో నవదంపతులతో పాటు వివాహానికి హాజరైన బంధువులూ పాలుపంచుకున్నారు.
ప్రతి ఒక్కరు వరకట్నానికి దూరంగా ఉండి.. నిరాడంబర పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు బిప్లబ్ కుమార్. ఇలాంటి వివాహాలు ఎలాంటి బాణసంచా మోతలు లేకుండా పర్యావరణ హితంగా ఉంటాయన్నారు.
తన కొత్త జీవితాన్ని సరికొత్త పద్ధతిలో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు అనిత. ఇలాంటి పెళ్లిళ్లు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
ఇదీ చూడండి: ఉల్లాసంగా- ఉత్సాహంగా గజరాజుల 'ఫుట్బాల్'