నేరపరిశోధన, విపత్తులు, అత్యవసర సమయాల్లో ఆధారాలు పసిగట్టేందుకు ఇన్నాళ్లు విదేశీ జాతి శునకాలను వినియోగించిన భద్రతా బలగాలు.. ఇకపై వాటి స్థానంలో దేశీ జాతి కుక్కలనే ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ ఎన్డీఆర్ఎఫ్ కేంద్రంలో శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర సమయాల్లో బలగాలకు సాయం చేసేందుకు వీలుగా జాతి శునకాలకు తర్పీదు ఇస్తున్నారు. ఇలా శిక్షణ తీసుకున్న వాటితో డాగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ కమాండెంట్ పీకే తివారీ తెలిపారు.
విదేశీ జాతి శునకాలపై ఆధారపడకుండా.. దేశీ వాటికే కావాల్సిన మెలకువలు నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శునకాలకు శిక్షణ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తివారీ చెప్పారు. కొన్ని కుక్కలు శిక్షణకు దూరంగా పారిపోయినట్లు తెలిపారు. అయినా.. చాలా ఓపికగా తర్పీదు ఇస్తున్నట్లు వివరించారు.