దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ)ని అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో తలదాచుకుంటున్న అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఎన్ఆర్‌సీ అమలుకు ప్రజలు 2019 ఎన్నికల ఫలితాల ద్వారా ఆమోదం తెలిపారన్న షా.. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే విషయాన్ని చెప్పామన్నారు. అందుకే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
" 2019 ఎన్నికల ద్వారా ఎన్ఆర్సీపై ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని, అక్రమ వలసదారులను చట్టపరంగా దేశం నుంచి తరిమికొడతామని నా ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ చెప్పాను."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఎన్ఆర్సీ అందుకే...
అసోంలో ఎన్‌ఆర్‌సీ గురించి మాట్లాడుతూ.. జాబితాలో చోటు దక్కించుకోని వారు ఫారినర్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పించామన్నారు షా. ఫీజు భరించలేని వారి కోసం లాయర్లను నియమించే సదుపాయాన్ని కూడా అసోం ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా విదేశీయులు అక్రమంగా వెళ్లి శాశ్వతంగా నివసించలేరని చెప్పారు. కానీ, మన దేశంలో మాత్రం అలా జరుగుతోందని.. అందుకే దేశ వ్యాప్తంగా పౌర జాబితా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.