జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియ చేపట్టే విషయంపై పలు కీలక అంశాలు వెల్లడించింది కేంద్ర హోంశాఖ. 2011 జనగణన ప్రమాణాల ప్రకారమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. జనగణన సమయంలో పుట్టిన తేదీ తెలియని పౌరుల వయసును ఆంగ్ల క్యాలెండర్ లేదా ముఖ్యమైన భారతీయ పండుగల ఆధారంగా నిర్ధరించాలని నిర్ణయించింది. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
ముస్లిం పండుగలను చేర్చకపోవటాన్ని తక్కువ చేసి చూడకూడదని స్పష్టం చేసింది ప్రభుత్వం. జనగణన 2011, ఎన్పీఆర్ 2010 ప్రమాణాల ప్రకారమే భారతీయ పండుగలను జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేసింది.
2021లో దేశవ్యాప్త జనగణన చేపట్టనుంది కేంద్రం. అంతకుముందే ఇంటింటి జనాభా సర్వేతో పాటు, ఎన్పీఆర్ యాప్‌తో జనాభా పట్టిక అప్‌డేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను 2015లో పరీక్షించింది ఎన్డీఏ ప్రభుత్వం.
తేదీ తెలియకున్నా..పండుగ గుర్తుంటే చాలు
వయసు ప్రాతిపదికన జనాభాను లెక్కింపునకు.. పుట్టిన తేదీ వివరాలు సేకరించటంలో కొన్ని ప్రమాణాలు పాటించనున్నారు. పుట్టిన సంవత్సరం మినహా.. తేదీ. నెల తెలియని వారి వయసు నిర్ధరించేందుకు అడగాల్సిన ప్రశ్నల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. తేదీ గుర్తులేకపోయినా ఏ ఏడాది, ఏ రుతువులో, ఏ పండుగ సమయంలో పుట్టారో చెబితే.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం వయసు అంచనా వేయాలని నిర్ణయించింది హోంశాఖ.
యాప్‌లోనే కాదు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించే ప్రత్యక్ష జనగణన విధానంలోనూ ఒకే రకమైన ప్రశ్నలు ఉండబోతున్నాయి.
⦁ మీరు వర్షాకాలానికి ముందు పుట్టారా, తరువాత పుట్టారా?
⦁ ఒకవేళ, వర్షాకాలం ముందు జన్మిస్తే.. అప్పడు సంక్రాంతి, శివరాత్రి, హోలీ, రామనవమి, గణతంత్ర దినోత్సవం, గుడ్ ఫ్రైడే లాంటి భారతీయ పండుగలేమైనా జరిగనట్టు మీ పెద్దవాళ్లు చెప్పారా?
⦁ వర్షాకాలంలో జన్మిస్తే... నాగులపంచమి, రాఖీ పౌర్ణమి, స్వాంతంత్ర్య దినోత్సవం, గురునానక్ జయంతి, క్రిస్మస్ లాంటి వాటిల్లో, ఏ పండుగ రోజుల్లో పుట్టారు?
ఇంటింటికి వెళ్లి జనగణన చేసే సమయంలోనే, ఈ ఎన్పీఆర్ యాప్ కోసమూ వివరాలు సేకరిస్తారు.
ఎన్పీఆర్పై నిరసనలు...
ఎన్పీఆర్ ప్రక్రియ దేశవ్యాప్త ఎన్ఆర్సీ(జాతీయ పౌర పట్టిక)కు తొలిమెట్టు అంటూ.. పలు చోట్ల నిరసనలు హోరెత్తాయి. తమ రాష్ట్రాల్లో ఎన్పీఆర్ ప్రక్రియను అమలు చేసేది లేదని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పుట్టిన తేదీ కోసం సిద్ధం చేసిన ప్రశ్నల జాబితాలో ముస్లిం పండుగలను ఎందుకు పేర్కొనలేదని నిరసనలు వెల్లువెత్తున్నాయి.
ఇదీ చదవండి:'భూత్ బంగ్లా' బురారీ హౌస్‌లోకి కొత్త కుటుంబం